“దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.”— యోహాను 4:24
ఆరాధనను గూర్చి నన్ను లోతుగా ఆలోచింపజేసింది ఒక కరెంట్ కోత. ఒక శనివారం సాయంత్రం కరెంట్ పోయి, గంటలు గడిచినా రాలేదు. ఫ్యాన్ ఆగిపోయింది. ఇన్వర్టర్ కాసేపు బీప్ బీప్ మని, చివరకు అదీ చేతులెత్తేసింది. ఎవరో కొవ్వొత్తి వెలిగించారు. ఆ ఉక్కపోతలో కూర్చుని ఆలోచించడం తప్ప మరో దారి లేదు.
ఆ ఆలోచనల మధ్యలో ఒక ప్రశ్న నా మనసును వదలకుండా పట్టుకుంది: రేపు ఆదివారం ఉదయం పది గంటలకు ఇలాగే కరెంట్ పోతే, నా సంఘం దేవుని ఆరాధించగలదా?
ఒక్కసారి ఊహించండి. కీబోర్డు లేదు, డ్రమ్స్ లేవు, పాటల మాటలు చూపించే ప్రొజెక్టర్ లేదు, లైవ్స్ట్రీమ్ లేదు. ఉక్కపోసే హాలులో, చేతిలో బైబిలుతో దేవుని ప్రజలు మాత్రమే. “పాస్టర్ గారూ, కరెంట్ వచ్చేవరకు ఆగుదాం” అని చాలా సంఘాలు నిజాయితీగా జవాబిస్తాయేమో అని నా భయం. మనకు తెలియకుండానే, మన ఆరాధన కూడా ఇన్వర్టర్ మీద ఆధారపడే స్థితికి వచ్చేసింది.
ఆ ఆలోచన నన్ను శతాబ్దాల వెనక్కి తీసుకెళ్లింది. రెండువేల సంవత్సరాల క్రితం దేవుని ప్రజలు ఎలా ఆరాధించారు? ఐదువందల సంవత్సరాల క్రితం ఎలా? వంద సంవత్సరాల క్రితం ఇవే గోదావరి పల్లెల్లో ఎలా ఆరాధించారు? దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరాల పాటు సంఘానికి కరెంటే తెలియదు. అంటే వారు మనకంటే తక్కువగా ఆరాధించారా? లేక మనం మరచిపోయిన ఏదో సత్యం వారికి తెలుసా?
తెలియకుండానే మనం నేర్పుతున్న పాఠం
ప్రతి ఆదివారం మన రాష్ట్రంలోని ఎన్నో సంఘాల్లో ఒక దృశ్యం కనిపిస్తుంది. సంఘమంతా కలిసి దాదాపు అరగంట పాటలు పాడుతుంది. ఆ తర్వాత వేదిక మీదనుండి అమాయకంగా అనిపించే ఒక మాట వినిపిస్తుంది: “ఇప్పుడు మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. కొద్దిసేపు మనమందరం లేచి నిలబడి బిగ్గరగా దేవుని ఆరాధిద్దాం.” బహుశా ఇటీవల ట్రెండ్ అవుతున్న ఒక పాట మొదలవుతుంది. అప్పటివరకు పాడినవి కేవలం పాటలే, ఆరాధన అని పిలవడానికి సరిపోనివే అన్నట్టు. ఆ ఒక్క “ఆరాధన పాట” ముగియగానే, పాటలు నడిపించిన సహోదరుడు ఇలా అంటాడు: “ఇంతవరకు చక్కటి ఆరాధన చేశాం. ఇప్పుడు కొంచెంసేపు వాక్యం విందాం.”
ఆ రెండు మాటల్లోనే మన ప్రజలకు రెండు తప్పుడు పాఠాలు నేర్పేశాం. మొదటిది, ఆరాధన అంటే పాటలే, అందులోనూ ఒక ప్రత్యేకమైన పాట మాత్రమే అసలైన ఆరాధన. రెండవది, దేవుని వాక్యం ఆరాధన ముగిసిన తర్వాత వచ్చే వేరే కార్యక్రమం. ప్రార్థన, వాక్య పఠనం, ప్రసంగం, కానుక, ప్రభువు బల్ల, ఇవన్నీ ఆరాధన కాదు, మరేదో అన్నట్టు.
ఈ పాఠాలు ఎంత లోతుగా నాటుకుపోయాయో బైబిలు కళాశాలలో ఒక విద్యార్థి మాటల్లో నాకు అర్థమైంది. “సార్, ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ప్రసంగించండి” అన్నారు. నేను ఒక్కటే అడిగాను: “అంటే ప్రసంగం ఆరాధన కాదా?” ఆ విద్యార్థి ఒక్క క్షణం ఆగిపోయారు. తప్పు ఆ విద్యార్థిది కాదు. ఆదివారం తర్వాత ఆదివారం, మనమే ఆ మాటను నేర్పాం.
నాకు సంగీతం అంటే ప్రాణం. మా కుటుంబమంతా సంగీతం అంటే చెవి కోసుకుంటుంది. మా నాన్నగారు రెవ. డా. వి. దైవాభిమాని గారు అనేక పాటలు రచించారు, సంగీత పరిచర్య ద్వారానే సేవలోకి వచ్చారు. నేను సంఘానికి సీనియర్ పాస్టర్ అయినా, సంఘంలో కీబోర్డ్ వాయించేవారు ఉన్నా, ఆదివారం నా పక్కనే కీబోర్డ్ పెట్టుకుని వాయించకపోతే నాకు ఆ రోజు సంతృప్తి ఉండదు. నేను సంగీత పరవశుడను. కాబట్టి ఇది సంగీతాన్ని కించపరచడానికో, సంగీత కళాకారులను తక్కువ చేయడానికో రాసిన వ్యాసం కాదు. ఇది మొదట నాకు నేను చెప్పుకుంటున్న మాట: ఆరాధన అంటే కేవలం సంగీతం కాదు. సంగీతం ఆరాధనలో దేవుడిచ్చిన ఒక విలువైన భాగం, కానీ ఆరాధన అంతా సంగీతం కాదు.
ఒక విషయం ముందే స్పష్టం చేయాలి. బైబిలులో ఆరాధనకు రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, మన జీవితమంతా దేవునికి అర్పించుకోవడం (రోమీయులకు 12:1). రెండు, దేవుని ప్రజలు ఆయన సన్నిధిలో కలిసి కూడడం (హెబ్రీయులకు 10:24-25). ఈ వ్యాసం ముఖ్యంగా రెండవదాని గురించి, అంటే సంఘ ఆరాధన గురించి. కానీ ఆదివారపు కూడిక, సోమవారం నుండి శనివారం వరకు సాగే జీవితారాధన నుండే పుడుతుంది.
బైబిలులో మొదటి “ఆరాధన”లో పాటే లేదు
ఆంగ్ల బైబిలులో worship (ఆరాధన) అనే పదం మొదటిసారి కనిపించేది ఆదికాండము 22:5లో. మన తెలుగు బైబిలు దానిని ఎంత అందంగా అనువదించిందో చూడండి. మోరీయా కొండ దగ్గర అబ్రాహాము తన పనివారితో “నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి” కొండ ఎక్కడం మొదలుపెట్టాడు (ఆదికాండము 22:5).
ఆ కొండ ఎక్కుతున్నప్పుడు వారి దగ్గర ఉన్నవి కట్టెలు, నిప్పు, కత్తి. అబ్రాహాము తన ఒక్కగానొక్క కుమారుణ్ణే దేవునికి అర్పించడానికి తీసుకెళ్తున్నాడు. వాయిద్యాలు లేవు, గాయక బృందం లేదు. దేవునికి ఏదీ దాచుకోని ఒక హృదయం మాత్రమే ఉంది. మన బైబిలు చెబుతున్నట్టు, ఆరాధన అంటే మ్రొక్కడం, దేవుని ఎదుట తల వంచడం.
మూల భాషలు కూడా ఇదే చెబుతాయి. హెబ్రీలో ఆరాధనకు వాడిన ముఖ్య క్రియ హిష్తఖావా. దాని అర్థం వంగి నమస్కరించడం, సాష్టాంగపడడం. దానితో పాటు ఆబద్, అంటే సేవ. గ్రీకు పదాలు కూడా అంతే. ప్రొస్కునియో గొప్పవాని ఎదుట సాగిలపడడం, లాత్రెయో దేవునికి చేసే సేవ. ఈ పదాలలో ఏదీ “పాడడం” అనే అర్థమివ్వదు. ఆరాధనకు పౌలు ఇచ్చిన గొప్ప నిర్వచనంలో కూడా సంగీతం ప్రస్తావన లేదు: “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది” (రోమీయులకు 12:1). మన తెలుగు బైబిలు ఇక్కడ ఆరాధనను సేవ అనడం గమనించండి. మన శరీరాన్ని, అంటే మన జీవితమంతటినీ, దేవునికి అర్పించడమే ఆరాధన. నాకు ఎంతో ఇష్టమైన పాత కీర్తన ఒకటి ఉంది: “తనువు నాదిదిగో గైకొనుమీయో ప్రభువా.” ఆ పాట కూడా దేవునికి పాటను కాదు, తనువునే అర్పిస్తుంది.
ఆరాధన: దేవుని ప్రత్యక్షతకు మన ప్రతిస్పందన
దేవుడు తనను తాను బయలుపరచుకొన్నప్పుడు, మనిషి తన సంపూర్ణ వ్యక్తిత్వంతో ఇచ్చే ప్రతిస్పందనే ఆరాధన. యెషయా దేవాలయంలో చూసిన దర్శనాన్ని ఇలా వర్ణించాడు: “అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని” (యెషయా 6:1). ఆ దర్శనం అతనిని పాపపు ఒప్పుకోలుకు, శుద్ధికి, చివరకు “చిత్తగించుము నేనున్నాను” అనే సమర్పణకు నడిపించింది (యెషయా 6:8). సెరాపులు పాడుతున్నారు నిజమే, కానీ ఆ దృశ్యానికి కేంద్రం పరిశుద్ధుడైన దేవుడు.
ఆరాధన చోటు గురించి అడిగిన సమరయ స్త్రీకి, యేసు ప్రభువు ఆరాధన సారం గురించి జవాబిచ్చారు: “అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది” (యోహాను 4:23). ఆరాధన ఎంత గొప్పగా వినిపించిందని దేవుడు చూడరు. అది ఎవరికి అర్పించబడిందో, ఆయన సత్యం మీద నిలిచి ఉందో లేదో చూస్తారు. ఒక రాగం దేవుని సత్యంతో సంబంధం లేకుండానే మన భావాలను కదిలించగలదు. అది ఆరాధన కాదు, కేవలం సంగీతం.
కరెంట్ రాకముందు ఆరాధన
తొలి క్రైస్తవులకు సంఘ భవనాలే లేవు. వారు ఇళ్లలో, నూనె దీపాల వెలుగులో కూడుకునేవారు. సుమారు క్రీ.శ. 112లో ప్లినీ అనే రోమా గవర్నరు వీరిని గూర్చి రాస్తూ, వీరు తెల్లవారకముందే కూడుకొని క్రీస్తుకు ఒక కీర్తన పాడేవారని, తర్వాత పరిశుద్ధంగా జీవిస్తామని ప్రమాణం చేసుకునేవారని రాశాడు. వారి పాట, వారి జీవితం రెండూ కలిసే ఉండేవి.
సంస్కరణోద్యమం ప్రజలకు వారి సొంత భాషలో దేవుని వాక్యాన్ని, సంఘమంతా కలిసి పాడే స్వరాన్ని తిరిగి ఇచ్చింది. ప్రతి తరంలోనూ సంగీతం ఉంది, కొన్నిచోట్ల గొప్ప గాయక బృందాలు, ఆర్గన్లు కూడా ఉన్నాయి. కానీ ఆరాధనకు కేంద్రం సంగీతం కాదు, దేవుని వాక్యం, ప్రార్థన, ప్రభువు బల్ల.
ఇప్పుడు మన సొంత నేలకు వద్దాం. వంద సంవత్సరాల క్రితం గోదావరి, కృష్ణా పల్లెల్లో ఒక తాటాకు పందిరి కింద, బుస్సుమనే పెట్రోమాక్స్ లైటు వెలుగులో, ప్రజలు నేలమీద కూర్చుని ఆరాధించేవారు. ఒక హార్మోనియం, ఒక డోలక్, ఒక జత తాళాలు. చాలాసార్లు అవి కూడా ఉండేవి కావు. చప్పట్లే సంగీతం. అయినా వారు పురుషోత్తమ చౌదరి గారు వంటి మన కవులు రాసిన కీర్తనలను గంటల తరబడి పాడేవారు. ఉపదేశకుడు లేఖనాన్ని నెమ్మదిగా చదివేవాడు. ప్రార్థనలు కొన్నిసార్లు కన్నీళ్లతో సాగేవి. రోజూ ఒక పిడికెడు బియ్యం దేవునికోసం పక్కనపెట్టి, తమ పేదరికంలోనుండి ఇచ్చారు. ఆ తరంవారి మనుమలను కొందరిని నేను ఎరుగుదును. వారు ఇప్పటికీ నలభై కీర్తనలు నోటికి పాడగలరు. కానీ వారి పక్కన కూర్చున్న యువకుడు స్క్రీన్ లేకుండా ఒక్క పాట కూడా పాడలేడు.
మరి మనం? మన పెద్దలకు ఈ విషయం మనకంటే బాగా అర్థమైంది, అది వారి భాషలోనే కనిపిస్తుంది. ఆదివారపు సంఘ కూడికనంతటినీ వారు ఆదివారపు ఆరాధన అన్నారు. వాక్య పఠనం, ప్రార్థనలు, ప్రసంగం, కానుక, పాటలు, అన్నీ కలిపి ఆరాధనే. తర్వాతి కాలంలో పాటల భాగాన్ని మాత్రమే స్తుతి ఆరాధన అని పిలవడం అలవాటైపోయింది.
ఆధునిక వాయిద్యాలకు నేను వ్యతిరేకిని కాను. మంచి కీబోర్డు పాపం కాదు, పెట్రోమాక్స్ లైటు పరిశుద్ధమైనదీ కాదు. కానీ కరెంట్ పోయినప్పుడు మన ఆరాధన తడబడితే, అది దేనిపై ఆధారపడి ఉందో ఒకసారి ప్రశాంతంగా పరిశీలించుకోవాలి.
సంఘం కూడినప్పుడు ఏమి చేస్తుంది?
తొలి సంఘం కూడుకొన్నప్పుడు ఏమి చేసిందో లూకా రాశాడు: “వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి” (అపొస్తలుల కార్యములు 2:42). లేఖనాన్ని బహిరంగంగా చదవడం (1 తిమోతికి 4:13), అందరికోసం విజ్ఞాపన (1 తిమోతికి 2:1), పాటలు పాడడం (కొలొస్సయులకు 3:16), కానుకలు ఇవ్వడం కూడా సంఘ కూడికలో భాగమే.
ఫిలిప్పీయులు పంపిన కానుకను పౌలు “దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి” అని వర్ణించాడు (ఫిలిప్పీయులకు 4:18). అంటే ఆదివారం కానుక సంచిలో మనం వేసేది కూడా ఆరాధనే. కాబట్టి సంఘ ఆరాధన అంటే ఆరాధనకు పిలుపు నుండి ఆశీర్వాదం వరకు జరిగే మొత్తం కూడిక. పాటలు కూడా ఆరాధనే, కానీ అవి అందులో ఒక భాగం మాత్రమే.
సంఘ ఆరాధన: దేవునికీ ఆయన ప్రజలకూ మధ్య సంభాషణ
సంఘ ఆరాధనను ఒక సంభాషణగా అర్థం చేసుకోవచ్చు. ఆ సంభాషణను మొదలుపెట్టేది దేవుడే. ఆయన తన ప్రజలను పిలుస్తారు, మనం కూడివస్తాం. అందుకే ఆరాధన దేవుని వాక్యంతో, ఆయన పిలుపుతో మొదలవ్వాలి. ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడుతారు. మనం ఒప్పుకోలుతో, ప్రార్థనతో, స్తుతితో, కానుకలతో జవాబిస్తాం. ప్రభువు బల్ల దగ్గర ఆయన మనలను పోషిస్తారు. అక్కడ మనం “ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు” (1 కొరింథీయులకు 11:26). చివరగా ఆయన ఆశీర్వాదంతో మనలను లోకంలోకి పంపిస్తారు. పాట ఈ సంభాషణలో ఒక భాగం, సంభాషణ మొత్తం కాదు.
ఈ ఆరాధన త్రిత్వ దేవుని ఆరాధన: “ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము” (ఎఫెసీయులకు 2:18). మన సంగీత నైపుణ్యం కాదు, క్రీస్తు మాత్రమే మనలను దేవుని సన్నిధికి తీసుకెళ్తారు.
ఇంకా లోతైన సత్యం ఒకటి ఉంది. సంఘ ఆరాధనకు నిజమైన నాయకుడు క్రీస్తే. హెబ్రీ పత్రిక క్రీస్తును గూర్చి ఇలా చెబుతుంది: “నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును” (హెబ్రీయులకు 2:12). మన స్తుతి ఆయన ద్వారానే తండ్రికి చేరుతుంది. అప్పుడు వేదిక మీద పాటలు నడిపించేవారి పని, సంఘాన్ని క్రీస్తు స్వరం వెంట నడిపించడమే.
ఈ కూడిక ఒకరినొకరు కట్టుకోవడానికి కూడా. పౌలు కొరింథు సంఘానికి ఇచ్చిన సూత్రం ఇది: “సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి” (1 కొరింథీయులకు 14:26). “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి” (1 కొరింథీయులకు 14:40). అందుకే హెబ్రీ పత్రిక “సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు” ఉండమని చెబుతుంది (హెబ్రీయులకు 10:24-25). ఆరాధనలోని ప్రతి పాటనూ, ప్రతి ప్రార్థననూ రెండు ప్రశ్నలతో పరీక్షించవచ్చు: ఇది దేవుని మహిమపరుస్తుందా? ఆయన ప్రజలను కట్టుతుందా?
సంగీతానికి సరైన స్థానం
అలాగని సంగీతాన్ని తక్కువగా చూడకూడదు. దేవుడు తన ప్రజలకు కీర్తనల గ్రంథాన్నే ఇచ్చారు. దావీదు శిక్షణ పొందిన లేవీయులను వాయిద్యాలతో దేవుని సేవకు నియమించాడు (1 దినవృత్తాంతములు 25:1). పరలోకం కూడా పాటలతో నిండి ఉంది (ప్రకటన 5:9-14).
కానీ మన పాటలను క్రొత్త నిబంధన ఎలా వర్ణిస్తుందో జాగ్రత్తగా చూడండి: “సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి” (కొలొస్సయులకు 3:16).
పౌలు దృష్టిలో పాట క్రీస్తు వాక్యాన్ని మనలో నింపే సాధనం. అందుకే బీట్ కంటే పాటలోని మాటలే ముఖ్యం. ఆ పాట వేదిక మీద ఉన్న నలుగురిది మాత్రమే కాదు, సంఘమంతటిది. మనం ఒకనికి ఒకడు బోధించుచు పాడతాం గనుక సంఘమే గాయక బృందం.
సంగీతం ఉండి ఆరాధన లేకపోయే ప్రమాదం ఉందని కూడా లేఖనం హెచ్చరిస్తుంది. పాటలు ఎక్కువ, న్యాయం తక్కువ ఉన్న ప్రజలతో దేవుడు ఆమోసు ద్వారా ఇలా అన్నారు: “మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు” (ఆమోసు 5:23).
మరోవైపు, సంగీతం లేకుండానే గొప్ప ఆరాధన జరిగిన సందర్భాలూ బైబిలులో ఉన్నాయి. ఒక్క రోజులోనే పిల్లలను, ఆస్తిని కోల్పోయిన యోబు “నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి” ఇలా అన్నాడు: “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక” (యోబు 1:20-21). ఇక్కడ కూడా మన బైబిలు ఆరాధనను సాష్టాంగ నమస్కారంగానే వర్ణిస్తుంది. అక్కడ పాట లేదు, వాయిద్యం లేదు. అయినా అది నిజమైన ఆరాధన.
ఈ రెండింటినీ కలగలిపితే మనం కోల్పోయేవి
భావోద్వేగం తప్పు కాదు. దావీదు “శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను” (2 సమూయేలు 6:14). “సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి” (కీర్తనలు 47:1) అని కీర్తనకారుడు పిలుస్తున్నాడు. కానీ భావోద్వేగం సత్యానికి జవాబుగా రావాలి, సత్యానికి బదులుగా కాదు.
సంగీతాన్నే ఆరాధన అనుకున్నప్పుడు, మంచి అనుభూతినే ఆరాధనగా పొరబడే ప్రమాదం ఉంది. “ఈరోజు ఆరాధన బాగా జరిగింది” అంటే మంచి అనుభూతి కలిగిందని అర్థం. ఆ అనుభూతిని కీ మార్పులు, పదే పదే పాడడం, లైట్లు, సౌండ్ కలిసి పుట్టిస్తాయి. క్రమంగా ప్రజలు దేవుని సన్నిధి కోసం కాకుండా ఒక వాతావరణం కోసం వెదకడం నేర్చుకుంటారు. సౌండ్ మరీ ఎక్కువైతే ప్రజలకు తమ స్వరమే వినిపించదు, క్రమంగా వారు పాడడం తగ్గించేస్తారు.
ఇది కల్పన కాదు, మనలో చాలామంది చూసిన దృశ్యమే. ఇది ఏ ఒక్క సంఘాన్నో, సంప్రదాయాన్నో ఉద్దేశించిన మాట కాదు. మనందరి సంఘాల్లో ఏదో ఒక రూపంలో కనిపించే అలవాటే.
ఆదివారపు లైవ్స్ట్రీమ్లు కూడా మనకు తెలియకుండానే మన ఆరాధనను మార్చేస్తున్నాయి. ఒక కొత్త పాట మొదలవగానే కెమెరాలు కదులుతాయి. ఏదో బాధలో ఉండి, ఆ పాట పాడుకుంటూ కన్నీరు కారుస్తున్న ఒక సహోదరి మీద కెమెరా ఆగుతుంది. ఆమె కన్నీరు నిజమైనది, ఆమె ఆరాధనా నిజమైనదే. కానీ ఆ క్షణం ఆమెకు, ఆమె దేవునికి మధ్య ఉండవలసినది. పాటల మధ్యలో కొన్ని వచనాలు చదవబడతాయి, కానీ అవి ఆరాధనకు కేంద్రంగా కాకుండా రెండు పాటల మధ్య వారధిగా మిగిలిపోతాయి.
వాక్యానికి విలువ కూడా తగ్గిపోతుంది. “ఇప్పుడు స్తుతి ఆరాధనే కదా” అని కొందరు ఆలస్యంగా వస్తారు, “ఆరాధన అయిపోయింది” అని మరికొందరు ముందే వెళ్లిపోతారు. లోతులేని పాటలను ఎవరూ ప్రశ్నించరు. కానీ తరచుగా మన ప్రజల విశ్వాసాన్ని మనం ప్రసంగించే మాటలకంటే వారు పాడే పాటలే ఎక్కువగా రూపొందిస్తాయి. కాబట్టి మన ప్రసంగాలను ఎంత జాగ్రత్తగా పరిశీలించుకుంటామో, వారి పాటలను కూడా అంతే జాగ్రత్తగా పరిశీలించాలి.
చిన్న సంఘాల కాపరులకు ఒక మాట
ఈ వ్యాసం రాయడానికి నాకున్న ముఖ్యమైన భారం ఇదే. మన రాష్ట్రంలో ఎక్కువ సంఘాలు చిన్నవి. ఒక్క డోలక్, ఒక పాత కీబోర్డు, ఒకటి రెండు మైకులు, అంతకంటే ఎక్కువ లేని సంఘాలే అనేకం. అలాంటి సంఘాల కాపరులు పట్టణంలోని పెద్ద సంఘాలను చూసి, తమ ఆరాధన తక్కువదని అనుకుంటున్నారు.
పెద్ద సౌండ్ సిస్టమ్, సినిమా కెమెరాలు, ఎల్ఈడీ తెరలు, ప్రతి ఆదివారానికి ఒక ట్రైలర్, ఒక పోస్టర్. ఇవన్నీ లేకపోతే మనం దేవుని కోసం తక్కువ చేస్తున్నామా? లేదు. సంఘ బడ్జెట్ అంతా పరికరాల మీద ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. మన బడ్జెట్లో మొదటి స్థానం పరికరాలకు కాదు, దేవుని వాక్యానికి, ఆయన ప్రజలకు దక్కాలి. అవి లేవని అపరాధభావంతో కుంగిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు.
ఎక్కువ ఖర్చుపెట్టి, ఎక్కువ ప్రకాశించే సంఘాలే దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తున్నాయని అనుకోవడం సహజమే. కానీ దేవుని కొలమానం వేరు. దేవుడు కోరేది ఇదే: “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము” (1 కొరింథీయులకు 4:2). ఆయన కొలిచేది నమ్మకత్వాన్ని, పరిమాణాన్ని కాదు. ప్రవక్త అడిగినట్టు, “కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు?” (జెకర్యా 4:10).
పెద్ద సంఘాలు ఆధునిక పరికరాలు వాడడం తప్పు కాదు. కానీ అవి మన కొలమానం కాకూడదు. ఒక్క డోలక్తో, దేవుని వాక్యం చుట్టూ విశ్వాసంతో కూడిన సంఘం నిజంగా ఆరాధిస్తోంది.
సేవకులకు, ఆరాధనా నాయకులకు ఒక మాట
ఈ పరిస్థితిని మార్చవచ్చు. ఒక్క మాటతో మొదలైన అపోహను ఒక్క మాటతోనే సరిచేయడం మొదలుపెట్టవచ్చు.
- మన మాటలు మార్చుకుందాం. “ఇప్పుడు మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం” అనడానికి బదులుగా “పాటలతో దేవుని ఆరాధిద్దాం” అందాం. తర్వాత “ఆయన వాక్యం విని దేవుని ఆరాధిద్దాం”, “మన కానుకలతో దేవుని ఆరాధిద్దాం” అందాం. అలాగే “రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ఆరాధిద్దాం” అనే మాటనూ ఆలోచించాలి. చేతులెత్తడం బైబిలుబద్ధమైనదే. కానీ పౌలు కోరింది “పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని” (1 తిమోతికి 2:8). దేవుడు చేతుల పవిత్రతను చూస్తారు. చేతులెత్తినా, మోకరించినా, మౌనంగా ఉన్నా, అది హృదయంలోనుండి రావాలి.
- కూడిక మొత్తాన్ని ఆరాధనగా రూపొందిద్దాం. యెషయా 6లోని క్రమం నుండి నేర్చుకుందాం: దేవుని ప్రత్యక్షత, మన ఒప్పుకోలు, ఆయన ఇచ్చే శుద్ధి, మన సమర్పణ. లేఖనం నుండి ఆరాధనకు పిలుపుతో మొదలుపెట్టి, పాప ఒప్పుకోలుకు, క్షమాపణ నిశ్చయతకు సమయం ఇద్దాం. లేఖనాన్ని తొందర లేకుండా చదువుదాం, లోతుగా ప్రార్థిద్దాం.
- మొదట సత్యం, తర్వాత రాగం. మన యువతకు పాత కీర్తనలు నేర్పిద్దాం. పాశ్చాత్య పాటలను అనువదించడమే కాకుండా, మన మాతృభాషలో, మన నేలలో పుట్టిన రాగాల్లో పాడదాం.
- ఆరాధనా బృందాలను ప్రదర్శకులుగా కాదు, సేవకులుగా తీర్చిదిద్దుదాం. అందరూ పాడగలిగే కీ, మితమైన సౌండ్ ఉండాలి. సంఘం ఎంత బాగా పాడిందో, దానినిబట్టే విజయాన్ని కొలుద్దాం.
- “కరెంట్ లేని ఆదివారం” పాటిద్దాం. మూడు నెలలకోసారి అన్నీ ఆపేసి, వాయిద్యాలు లేకుండా కేవలం స్వరాలతో పాడదాం, వాక్యం బిగ్గరగా చదువుదాం, ప్రార్థిద్దాం. తాము ఇప్పటికీ ఆరాధించగలమని మన ప్రజలు తెలుసుకోనిద్దాం.
చివరగా, ఆరాధన సోమవారం కూడా కొనసాగుతుందని మన ప్రజలకు నేర్పిద్దాం (కొలొస్సయులకు 3:17). ఆదివారం మనలను ఒక్కచోట చేర్చి తర్ఫీదు ఇస్తుంది, కానీ ఆరాధనను ఆ ఒక్క రోజుకే పరిమితం చేయదు.
మళ్లీ మోరీయా కొండకు
అబ్రాహాము మ్రొక్కడానికి కొండ ఎక్కాడు, దేవుని ఏర్పాటును చూసి దిగివచ్చాడు: “అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను” (ఆదికాండము 22:14). ఆ కొండ మీద సంగీతం లేదు, అయినా మనలో చాలామంది కంటే అతడు నిజంగా ఆరాధించాడు. శతాబ్దాల తర్వాత అదే కొండల మీద దేవుడు నిజమైన గొర్రెపిల్లను ఏర్పాటు చేశారు. మన ఆరాధన సిలువ దగ్గర మొదలవుతుంది. క్రీస్తు తనను తాను సంపూర్ణంగా అర్పించుకొన్నారు, కాబట్టి మనం కూడా మనలను సంపూర్ణంగా ఆయనకు అర్పించుకుంటాం.
మరోసారి ఆదివారం ఉదయం కరెంట్ పోతే, నా సంఘం కరెంట్ కోసం ఎదురుచూడకుండా, రెండువేల సంవత్సరాలుగా సంఘం చేస్తూ వచ్చినట్టే బైబిలు తెరిచి, తమ స్వరాలతోనే దేవుని ఆరాధిస్తుందని ఆశిస్తున్నాను. చిన్న సంఘాల కాపరులారా, మీ దగ్గర లేని పరికరాల కంటే, మీ మధ్య ఉన్న దేవుడు గొప్పవాడు. సంగీతం ఆరాధనను మోసుకొని వెళ్లగలదు, కానీ ఎన్నటికీ ఆరాధన స్థానాన్ని తీసుకోలేదు.
Pastor John Prabhu Kiran,
Senior Pastor - IBM Church,
Professor of Theology - Andhra Bible College
పూర్తి వ్యాసాన్ని PDF గా డౌన్లోడ్ చేసుకోండి (A5, 11 పేజీలు)


