ఈ లోకంలో అన్యాయానికి గురికాని మనిషి ఎవరూ లేరు. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు గాయం చేసే ఉంటారు.
అవసరంలో ఉన్నాడని అప్పు ఇచ్చాం. “వచ్చే నెల ఇచ్చేస్తాను” అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తడు, ఎదురుపడితే తప్పించుకొని వెళ్లిపోతాడు. కుటుంబంలోనూ అంతే. ఎదురుగా ఉన్నప్పుడు తియ్యటి మాటలు, వెనక్కి తిరగగానే చెడు మాటలు. అదీ వేరెవరో కాదు, మన సొంత బంధువులే. సంఘంలో కూడా మనం నమ్మిన సహోదరులే నమ్మించి నట్టేట ముంచుతారు.
ఈ గాయాలన్నిటిలో ఒక్కటే విషయం కనిపిస్తుంది. మనల్ని బాధపెట్టింది శత్రువులు కాదు, మనం నమ్మినవారే. అందుకే ఆ గాయం ఇంత లోతుగా ఉంటుంది. దావీదు కూడా ఇదే బాధతో ఇలా అన్నాడు: “నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజనము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను” (కీర్తనలు 41:9).
ఇటువంటివారి గురించి లోకం ఇచ్చే సలహా ఒక్కటే: “ఇంక వాడితో సంబంధం తెంచేసుకో.” మన పెద్దలు చెప్పే సామెత ఒకటుంది: “పాలు కాలినవాడు మజ్జిగ కూడా ఊది తాగుతాడు.” ఒకసారి గాయపడిన మనిషి జీవితాంతం జాగ్రత్తగా దూరం పాటిస్తాడు.
ఇప్పుడు ఒక్క క్షణం ఊహించండి. మీకు అన్యాయం చేసిన ఆ వ్యక్తి ఒకరోజు మీ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి “నన్ను క్షమించండి” అంటే మీరేం చేస్తారు? తలుపు తీస్తారా, మూసేస్తారా?
ఇరవై ఐదు వచనాల ఉత్తరం
పౌలు రాసిన పత్రికలన్నిటిలో ఫిలేమోనుకు రాసిన పత్రిక అతి చిన్నది. ఒకే అధ్యాయం, ఇరవై ఐదు వచనాలు. పారిపోయిన ఒక దాసుని గురించి ఒక స్నేహితునికి రాసిన చిన్న వ్యక్తిగత ఉత్తరం మాత్రమే. అయినా ఆది సంఘం ఈ ఉత్తరాన్ని భద్రంగా దాచింది, పరిశుద్ధాత్ముడు దీనిని దేవుని వాక్యంలో ఉంచారు. ఎందుకు?
ఆసియా ప్రాంతంలోని కొలొస్సయి పట్టణంలో ఫిలేమోను అనే ధనవంతుడు ఉండేవాడు. పౌలు ఎఫెసులో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతడు క్రీస్తును అంగీకరించాడు. ప్రతి వారం అతని ఇంట్లోనే విశ్వాసులు కూడుకొని ఆరాధించేవారు. అతని భార్య అప్ఫియ, కుమారుడు అర్ఖిప్పు కూడా ఆ సంఘంలో సేవ చేసేవారు.
ఆ ఇంట్లో ఒనేసిము అనే దాసుడు ఉండేవాడు. ఒకరోజు ఉదయం లేచి చూస్తే ఒనేసిము కనిపించలేదు. రాత్రికి రాత్రే పారిపోయాడు, బహుశా యజమాని డబ్బు కొంత తీసుకొని. ఆ రోజుల్లో దాసుడు పారిపోవడం చాలా పెద్ద నేరం. పట్టుబడితే కొరడా దెబ్బలు కొట్టేవారు, నుదుటి మీద కాల్చిన ఇనుముతో ముద్ర వేసేవారు, ఇంకా కఠినమైన శిక్షలు విధించేవారు. అందుకే ఒనేసిము వందల మైళ్ల దూరంలో ఉన్న రోమా మహానగరానికి పారిపోయాడు. లక్షలమంది జనం మధ్య తనను ఎవరూ గుర్తుపట్టరని అనుకున్నాడు.
కానీ దేవుని ఆలోచన వేరు. అదే రోమాలో అపొస్తలుడైన పౌలు సువార్త కొరకు బంధకాలలో ఉన్నాడు. ఒకరోజు పారిపోయిన ఆ దాసుడు, తన యజమానిని రక్షణలోకి నడిపించిన అదే పౌలు ఎదుట నిలబడ్డాడు. పౌలు అతనికి యేసుక్రీస్తును గూర్చి చెప్పాడు. ఆ సంకెళ్ల మధ్యనే ఒనేసిము క్రీస్తును ఎరిగాడు. అప్పటినుండి పౌలుకు సేవ చేస్తూ అతని హృదయానికి దగ్గరయ్యాడు (ఫిలేమోనుకు 10–13).
పౌలు కోరుకుంటే ఒనేసిమును తనవద్దే ఉంచుకోగలడు. కానీ ఒనేసిము చేసిన తప్పు ఇంకా సరిదిద్దబడలేదు. అతడు తన యజమాని దగ్గరకు తిరిగి వెళ్లాలి. సుమారు క్రీ.శ. 62లో పౌలు చెరసాలలో కూర్చుని రెండు ఉత్తరాలు రాశాడు. ఒకటి కొలొస్సయి సంఘానికి, రెండవది ఫిలేమోనుకు. ఆ ఉత్తరాలతో పాటు ఒనేసిమును తిరిగి పంపాడు.
ఒకప్పుడు కొలొస్సయి నుండి పారిపోయిన దారిలోనే ఇప్పుడు ఒనేసిము తిరిగి నడుస్తున్నాడు. ప్రతి అడుగుకు కొలొస్సయి దగ్గరవుతోంది, ప్రతి అడుగుకు అతని గుండె వేగం పెరుగుతోంది. “యజమాని నన్ను చూడగానే ఏం చేస్తాడు? కొరడా ఎత్తుతాడా? ముద్ర వేయిస్తాడా? లేక...” అతని చేతిలో ఉన్నది ఒకే ఒక ఆశ: పౌలు స్వహస్తంతో రాసిన ఉత్తరం.
గుమ్మం ముందు ఒక దాసుడు
చివరికి ఆ రోజు వచ్చింది. ఒనేసిము ఫిలేమోను ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. తలుపు లోపల ఫిలేమోను ఉన్నాడు. అతని మనసులో పాత గాయం ఉంది, పోయిన డబ్బు జ్ఞాపకం ఉంది. చట్టం కూడా అతని పక్షానే ఉంది.
ఆ తలుపు వెనుక నిలబడిన ఫిలేమోనుకు, అలాగే ఈ రోజు మనకు, దేవుడు ఒక్క మాట చెబుతున్నారు: మీకు అన్యాయం చేసిన సహోదరుని మీరు చేర్చుకోవాలి. ఎలా చేర్చుకోవాలి? ఈ చిన్న పత్రికలో పౌలు మూడు విధానాలు చూపిస్తున్నాడు.
మొదటి విధానం: ఇష్టపూర్వకమైన ప్రేమతో
మనల్ని ప్రేమించేవారిని ప్రేమించడం సులభమే. కానీ మనకు అన్యాయం చేసినవాడు ఎదురుపడినప్పుడు మన ప్రేమ ఎక్కడ ఉంటుంది?
పౌలు తన విన్నపాన్ని వెంటనే మొదలుపెట్టలేదు. ముందుగా ఫిలేమోను ప్రేమను గుర్తుచేశాడు. ప్రభువైన యేసు ఎడల అతని విశ్వాసం గురించి, సమస్త పరిశుద్ధుల ఎడల అతని ప్రేమ గురించి విని, పౌలు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు (ఫిలేమోనుకు 4-5). ఫిలేమోను ఇల్లు సంఘానికి ఆశ్రయంగా ఉంది. అతని వల్ల అనేకుల హృదయాలు విశ్రాంతి పొందాయి: “పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను” (ఫిలేమోనుకు 7).
కానీ ఆ మాటల్లో ఒక ప్రశ్న దాగి ఉంది. ఆ “సమస్త పరిశుద్ధులలో” ఇప్పుడు ఒనేసిము కూడా ఉన్నాడు. తనకు అన్యాయం చేసినవాని దగ్గర కూడా ఫిలేమోను ప్రేమ పనిచేస్తుందా? అందుకే పౌలు ఇలా ప్రార్థిస్తున్నాడు: “ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను” (ఫిలేమోనుకు 6). మాటలలో ఉన్న ప్రేమ ఇప్పుడు చేతలలోకి రావాలి.
అయితే పౌలు ఆ ప్రేమను ఆజ్ఞతో రాబట్టాలనుకోలేదు. అతడు అపొస్తలుడు. “ఇది చేయి” అని ఆజ్ఞాపించే అధికారం అతనికి ఉంది. అయినా ఆ అధికారాన్ని ప్రక్కన పెట్టాడు: “కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని” (ఫిలేమోనుకు 8-9). ఒనేసిమును పంపుతూ, “నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను” అన్నాడు (ఫిలేమోనుకు 12). అతనిని తనవద్దే ఉంచుకొనే అవకాశం ఉన్నా, ఫిలేమోను సమ్మతి లేకుండా ఏమీ చేయలేదు: “నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు” (ఫిలేమోనుకు 14).
చాలాసార్లు మనం పెద్దల మాటకో, పరువుకో భయపడి సమాధానపడతాం. కానీ బలవంతంగా చేసిన క్షమాపణ నిజమైన క్షమాపణేనా? ప్రభువు స్వయంగా ఇలా హెచ్చరించారు: “మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను” (మత్తయి 18:35).
మన ఊళ్లలో పంచాయితీ ఎలా జరుగుతుందో మనందరికీ తెలుసు. రెండు కుటుంబాల మధ్య పొలం గట్టు గొడవో, డబ్బు గొడవో ఉంటుంది. ఊరి పెద్దలు రచ్చబండ దగ్గర కూర్చుంటారు. ఇద్దరినీ పిలిచి, “సరే, చాలు, ఇంక చేతులు కలపండి” అంటారు. ఊరంతా చూస్తుంది కాబట్టి ఇద్దరూ చేతులు కలుపుతారు. అందరూ చప్పట్లు కొడతారు, పంచాయితీ ముగిసిపోతుంది. కానీ ఇంటికి వెళ్లిన తర్వాత ఒకరి గుమ్మం మీద ఇంకొకరు కాలు పెట్టరు. పెళ్లికి పిలవరు, చావుకి రారు. చేతులు కలిశాయి, కానీ మనసులు కలవలేదు. పౌలు ఫిలేమోనుకు పంచాయితీ తీర్పు ఇవ్వలేదు. అతని హృదయాన్ని అడిగాడు.
మీకు అన్యాయం చేసిన వ్యక్తితో మీరు ఇప్పటికే పైపైన “సమాధానం” చేసుకొని ఉండవచ్చు. సంఘంలో ఎదురుపడితే నవ్వుతున్నారు, పలకరిస్తున్నారు. కానీ మనసులో దూరం అలాగే ఉంచుకున్నారు. ఈ వారం ఆ వ్యక్తి పేరును దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థించండి: “ప్రభువా, బలవంతంతో కాదు, ప్రేమతో అతనిని చేర్చుకొనే హృదయం నాకు ఇమ్ము.” తర్వాత మీ ప్రేమను ఒక్క చిన్న పనిలో చూపించండి: ఒక ఫోన్ కాల్, ఒక పలకరింపు, ఇంటికి ఒక ఆహ్వానం. మీ ప్రేమ మాటలలోనే ఆగిపోకుండా కార్యకారి కావాలి.
ఇష్టపూర్వకమైన ప్రేమతో చేర్చుకోవాలి, సరే. కానీ ఏ హోదాలో? పాత దాసునిగానా, కొత్త మనిషిగానా?
రెండవ విధానం: సహోదరునిగా
మనల్ని బాధపెట్టినవారు మారినా, మన మనసులో వారి పాత ఫోటోనే ఉంటుంది. దేవుడు మార్చిన మనిషిని మనం మారనివ్వడం లేదా?
ఫిలేమోను జ్ఞాపకంలో ఉన్నది పాత ఒనేసిము, రాత్రికి రాత్రే పారిపోయిన నమ్మకద్రోహి. కానీ పౌలు అతనిని పూర్తిగా వేరే విధంగా పరిచయం చేస్తున్నాడు: “నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను” (ఫిలేమోనుకు 10-11).
ఇక్కడ పౌలు ఒక చిన్న పదచమత్కారం చేస్తున్నాడు. ఒనేసిము అనే పేరుకు “ప్రయోజనకరమైనవాడు” అని అర్థం. పారిపోయినప్పుడు అతడు తన పేరుకు తగినట్టు బ్రతకలేదు, “నిష్ప్రయోజనమైనవాడు” అయ్యాడు. క్రీస్తులో ఇప్పుడు తన పేరుకు తగినవాడయ్యాడు. గుమ్మం ముందు నిలబడినవాడు పాత దాసుడు కాదు: “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను” (2 కొరింథీయులకు 5:17).
గాయం తగిలినప్పుడు మనకు గాయం మాత్రమే కనిపిస్తుంది. ఆ గాయం వెనుక కూడా దేవుడు పనిచేస్తున్నారని మనం నమ్మగలమా? పౌలు ఎంత జాగ్రత్తగా రాశాడో చూడండి. “ఒనేసిము పారిపోయాడు” అని రాయలేదు. ఇలా రాశాడు: “అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను” (ఫిలేమోనుకు 15-16).
ఒనేసిము చేసిన పాపాన్ని పౌలు సమర్థించడం లేదు. కానీ మనుష్యుని పాపం వెనుక కూడా దేవుని ఆలోచన పనిచేస్తుందని చూపిస్తున్నాడు. ఒనేసిము పారిపోయి ఉండకపోతే రోమాకు వెళ్లేవాడు కాదు, పౌలును కలిసేవాడు కాదు, రక్షణ పొందేవాడు కాదు. ఫిలేమోను ఒక దాసుని “కొద్దికాలము” పోగొట్టుకొన్నాడు, కానీ దేవుడు అతనికి ఒక సహోదరుని “ఎల్లప్పుడు” తిరిగి ఇచ్చారు. యోసేపు తన అన్నలతో చెప్పిన మాట ఇదే: “మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను” (ఆదికాండము 50:20).
చాలామంది “క్షమించాను, కానీ దూరంగానే ఉంచుతాను” అంటారు. క్షమించడం మాత్రమే సరిపోతుందా? పౌలు అడుగుతున్నది ఒనేసిమును కేవలం క్షమించమని కాదు. “దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను” చేర్చుకొమ్మని అడుగుతున్నాడు. “శరీరవిషయమును ప్రభువు విషయమును” అంటే ఆదివారం సంఘంలోనే కాదు, సోమవారం ఇంట్లో కూడా అతడు సహోదరుడే. ఈ పత్రిక మొదట్లో పౌలు ఫిలేమోనును “ప్రియుడు” అని, “సహోదరుడా” అని పిలిచాడు (ఫిలేమోనుకు 1, 7). ఇప్పుడు అవే పేర్లను ఒనేసిముకు ఇస్తున్నాడు. క్రీస్తులో యజమాని, దాసుడు ఒకే స్థాయిలో నిలబడుతున్నారు: “ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు” (గలతీయులకు 3:28).
మన ఇళ్లలో పెళ్లి జరిగినప్పుడు ఒక దృశ్యం గమనించండి. ఫోటోగ్రాఫర్ “ఫ్యామిలీ ఫోటో, అందరూ రండి” అని పిలుస్తాడు. అమ్మ, నాన్న, అన్నలు, వదినలు, పిల్లలు అందరూ వరుసగా నిలబడతారు. కానీ ఆ ఇంట్లో పది సంవత్సరాలుగా పనిచేస్తున్న మనిషి మాత్రం పక్కన నిలబడి, అందరి చెప్పులు, సంచులు పట్టుకొని చూస్తుంటాడు. ప్రతిరోజూ ఆ ఇంట్లోనే ఉంటాడు, కానీ ఫోటోలో మాత్రం ఉండడు. పౌలు ఫిలేమోనుతో చెబుతున్నది ఇదే: “ఒనేసిమును ఇకపై ఫోటో బయట నిలబెట్టకు. అతనిని కుటుంబ ఫోటోలో నీ పక్కన నిలబెట్టు.”
మీకు అన్యాయం చేసిన సహోదరుడు పశ్చాత్తాపపడి తిరిగి వచ్చినప్పుడు, అతనిని “పరీక్షా కాలం”లో ఉంచకండి. అతని పాత తప్పును ప్రతిసారి గుర్తుచేయకండి, ఇతరుల దగ్గర అతని పాత కథ చెప్పకండి. దేవుడు అతనిలో చేసిన మార్పును గుర్తించండి. అతనిని సహోదరునిగా పిలవండి, మీ ఇంటి భోజనపు బల్ల దగ్గర అతనికి చోటు ఇవ్వండి.
ఇంకా ఒక ప్రశ్న మిగిలి ఉంది. అతడు చేసిన నష్టం సంగతేమిటి? ఆ ఋణం ఎవరు తీర్చాలి?
మూడవ విధానం: అతని ఋణం మన లెక్కలో
ప్రియమైనవారికి మనం పూర్తి తలుపు తీస్తాం, అన్యాయం చేసినవారికి సగం తలుపే తీస్తాం. దేవుడు కోరేది సగం తలుపా?
పదహారు వచనాల వరకు పౌలు ఫిలేమోనుకు ఒక్క ఆజ్ఞ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పత్రికలోని మొదటి ఆజ్ఞ వస్తుంది: “కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము” (ఫిలేమోనుకు 17). ఎలా చేర్చుకోవాలి? “నన్ను చేర్చుకొన్నట్టు.” పౌలు ఫిలేమోను ఇంటికి వస్తే, ఫిలేమోను పరుగెత్తుకొని వచ్చి కౌగిలించుకుంటాడు, మంచి గది ఇస్తాడు, మంచి భోజనం పెడతాడు. ఒనేసిముకు కూడా అదే స్వాగతం కావాలని పౌలు అడుగుతున్నాడు. ఫిలేమోను గుమ్మం ముందు ఒనేసిమును చూసినప్పుడు, అక్కడ పౌలునే చూడాలి. మనందరికీ ఇదే ఆజ్ఞ: “కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి” (రోమీయులకు 15:7).
“క్షమించాను” అంటాం, కానీ జరిగిన నష్టం గురించి మాట్లాడుతూనే ఉంటాం. నష్టాన్ని ఎవరో ఒకరు భరించకుండా నిజమైన క్షమాపణ ఉంటుందా? ఒనేసిము ఫిలేమోనుకు నిజంగా నష్టం కలిగించాడు. పౌలు ఆ విషయాన్ని దాచడం లేదు, “ఏమీ జరగలేదు, మరచిపో” అని కూడా అనడం లేదు. ఇలా రాస్తున్నాడు: “అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము; పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును” (ఫిలేమోనుకు 18-19).
“అది నా లెక్కలో చేర్చుము” అనేది వ్యాపారంలో ఖాతా పుస్తకంలో రాసే మాట. తర్వాత పౌలు తన స్వహస్తంతో ప్రామిసరీ నోటు రాసినట్టు రాస్తున్నాడు: “అది నేనే తీర్తును.” ఋణం మాయమవ్వలేదు. అది ఒనేసిము పేరు నుండి పౌలు పేరు క్రిందికి మారింది.
ప్రియులారా, ఇదే సువార్త. మనం దేవునికి తీర్చలేని ఋణం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు “అది నా లెక్కలో చేర్చుము” అని చెప్పి, సిలువపై తన రక్తంతో ఆ ఋణాన్ని తీర్చేశారు. “దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి” (కొలొస్సయులకు 2:14).
ఇతరులు మనకు ఎంత బాకీ ఉన్నారో మనం బాగా గుర్తుంచుకుంటాం. కానీ మనం దేవునికి ఎంత బాకీ ఉన్నామో మరచిపోతున్నామా? పౌలు మెల్లగా ఒక మాట గుర్తుచేస్తున్నాడు: “అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?” (ఫిలేమోనుకు 19). ఫిలేమోనూ, ఒనేసిము నీకు కొంచెం డబ్బు బాకీ ఉన్నాడు, కానీ నీవు నీ ప్రాణమంతటినీ బాకీ ఉన్నావు. ఎంత పెద్ద ఋణం నుండి విడిపించబడ్డామో తెలిసినవాడు చిన్న ఋణాన్ని పట్టుకొని కూర్చోలేడు.
అందుకే పౌలు ధైర్యంగా ఇలా ముగిస్తున్నాడు: “నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను” (ఫిలేమోనుకు 21). క్షమింపబడినవాడు కొలత పెట్టి క్షమించడు, కొలత దాటి క్షమిస్తాడు. ప్రభువు చెప్పిన ఉపమానంలో, తన అప్పంతా క్షమింపబడి కూడా తోడిదాసుని క్షమించని దాసునికి రాజు ఇచ్చిన తీర్పు ఇదే: “నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను” (మత్తయి 18:33).
మన వీధి చివర కిరాణా కొట్టు ఉంటుంది. ఆ కొట్టు అన్న దగ్గర ఒక పాత ఖాతా పుస్తకం ఉంటుంది. ఒకరోజు ఒక పేద ముసలమ్మ బియ్యం, నూనె, పప్పు తీసుకొని బిల్లు చూసి నిలబడిపోయింది. కొట్టు అన్న, “అమ్మా, ఇప్పటికే నీ ఖాతాలో చాలా బాకీ ఉంది” అన్నాడు. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు వెనుక లైన్లో నిలబడిన ఒక మనిషి ముందుకు వచ్చి, “అన్నా, ఆమె పాత బాకీ, ఈ రోజు బిల్లు అంతా నా ఖాతాలో రాసుకో” అన్నాడు. ఆ ముసలమ్మ బాకీ మాయమవ్వలేదు, వేరొకరి పేరు క్రిందికి మారింది. ఫిలేమోనుకు పౌలు చెప్పింది ఇదే. కల్వరి సిలువ దగ్గర యేసుక్రీస్తు మన గురించి తండ్రితో చెప్పింది కూడా ఇదే: “వారి బాకీ అంతా నా ఖాతాలో రాసుకో.”
మీకు అన్యాయం చేసినవాని పేరు మీద మీ మనసులో ఒక ఖాతా తెరిచి ఉంచారా? అతడు చేసిన ప్రతి తప్పును, అన్న ప్రతి మాటను ఆ పుస్తకంలో రాసుకొని ఉంచారా? క్రీస్తు మీ పుస్తకాన్ని సిలువపై మూసివేశారు. ఈ రోజు మీరు కూడా ఆ ఖాతాను మూసివేయండి. బాకీ వసూలు చేయాలనే కోరికను, అతనిని శిక్షించాలనే కోరికను విడిచిపెట్టండి.
తలుపు తెరవండి
మీకు అన్యాయం చేసిన సహోదరుని ఇష్టపూర్వకమైన ప్రేమతో, సహోదరునిగా, అతని ఋణాన్ని మన మీద వేసుకొని చేర్చుకోవాలని ఈ చిన్న పత్రిక మనకు నేర్పుతుంది.
ఆ రోజు ఫిలేమోను తలుపు తీశాడా? బైబిలు ఆ విషయం చెప్పదు. కానీ చరిత్రలో ఒక ఆధారం మనలను ఆలోచింపజేస్తుంది. సుమారు యాభై సంవత్సరాల తర్వాత, క్రీ.శ. 110 ప్రాంతంలో, అంతియొకయ బిషప్ ఇగ్నేషియస్ ఎఫెసు సంఘానికి ఒక ఉత్తరం రాశాడు. అందులో ఎఫెసు సంఘ బిషప్ పేరు ఒనేసిము అని ప్రస్తావించాడు. ఒకప్పటి పారిపోయిన దాసుడే తర్వాత సంఘ కాపరి అయ్యాడా? ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఆ ప్రశ్న మనసులో నిలిచిపోతుంది.
ఆది సంఘం ఈ ఇరవై ఐదు వచనాల ఉత్తరాన్ని ఎందుకు భద్రంగా దాచిందో ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతి తరంలో ఒక ఒనేసిము గుమ్మం ముందు నిలబడతాడు. ప్రతి తరంలో ఒక ఫిలేమోను తలుపు వెనుక నిలబడతాడు.
ఈ రోజు మీ గుమ్మం ముందు ఎవరు నిలబడి ఉన్నారు?
మనం కూడా ఒకప్పుడు దేవుని గుమ్మం ముందు నిలబడిన పారిపోయిన దాసులమే. చేతిలో ఏమీ లేదు, తీర్చలేని బాకీ తప్ప. అయినా ఆయన తలుపు తెరిచారు. మన బాకీని తన లెక్కలో వేసుకున్నారు. మనలను దాసులుగా కాదు, కుమారులుగా చేర్చుకున్నారు: “కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే” (గలతీయులకు 4:7).
క్రీస్తు మనకోసం తెరిచిన తలుపును, మనకు అన్యాయం చేసినవారికి మనం మూసివేయలేం.


