+91 94404 78787 · andhrabiblecollege@gmail.com · Mon–Fri, 9 am–5 pm IST eCampus loginOrientationSTARR Library catalogueGive
Andhra Bible College seal Andhra Bible College
ఆంధ్రా బైబిల్ కళాశాల

Read · ధ్యాన వ్యాసము · Devotional

కదలిన గర్భము — కదిలించే దేవుడు

Moved by God: Two Mothers, Two Movements

ఇద్దరు తల్లులు, రెండు కదలికలు


“ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను.”— లూకా 1:41

ప్రతి తల్లి జీవితంలో ఆమె ఎన్నటికీ మరచిపోని ఒక క్షణం ఉంటుంది: గర్భములో బిడ్డ మొదటిసారి కదిలిన క్షణం. నాలుగైదు నెలలప్పుడు, ఏదో ఒక సాయంత్రం నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు, లోపల ఒక చిన్న అల కదిలినట్లు అనిపిస్తుంది. మొదట ఆమెకే నమ్మకం కలగదు. మళ్లీ కదులుతుంది. అప్పుడు ఆమె ముఖంలో ఒక చిరునవ్వు మెల్లగా విరుస్తుంది. వెంటనే భర్తను పిలిచి, “ఇదిగో, చెయ్యి ఇక్కడ పెట్టు, కదులుతుంది!” అంటుంది. ఇద్దరూ ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తారు. ఇంకా ఎవరూ ఆ బిడ్డ ముఖం చూడలేదు; కానీ తల్లి ఆ బిడ్డను అనుభవిస్తుంది. ఆ రోజు నుండి గర్భము కేవలం ఒక శుభవార్త కాదు, ఒక సజీవ బంధం అవుతుంది.

అందుకే మన తెలుగు ఇళ్లలో జరిగే సీమంతం కేవలం ఒక సంప్రదాయం కాదు. విశ్వాసికి అది ఒక పరిశుద్ధ సందర్భం, ఎందుకంటే ఎవరూ చూడని ఆ రహస్య స్థలంలో దేవుడే స్వయంగా ఒక ప్రాణాన్ని నిర్మిస్తున్నారు. యోబు ఆ కృపను తలచుకుంటూ, “జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి” (యోబు 10:12) అన్నాడు. దావీదు ఆశ్చర్యంతో నిండి, “నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే” (కీర్తనలు 139:13) అని పాడాడు. యెషయా అయితే తన జీవితపు ఆరంభం నుండే తనను ఎరిగిన ప్రేమను గుర్తుచేసుకుంటూ, “నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను” (యెషయా 49:1) అని సాక్ష్యమిచ్చాడు. జీవమిచ్చేది, రహస్యంలో రూపమిచ్చేది, పేరుపెట్టి పిలిచేది ఆయనే. కాబట్టి తల్లి లోపల అనిపించే ప్రతి చిన్న కదలికా, దేవుడు ఈ క్షణమే అక్కడ పనిచేస్తున్నారని చెప్పే ఒక మృదువైన సాక్ష్యం.

మూయబడిన గర్భమును తెరిచిన దేవుడు

బైబిలులో గర్భములో బిడ్డ కదలికను అనుభవించిన తల్లులను తలచుకుంటే, ఇద్దరు నా మనసులో నిలుస్తారు: రిబ్కా, ఎలీసబెతు.

రిబ్కా, విశ్వాసులకు తండ్రియైన అబ్రాహాము కోడలు, ఇస్సాకు భార్య. అబ్రాహాము సంతానమును విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అయినా ఆ వాగ్దాన కుటుంబంలోనే రిబ్కా గొడ్రాలుగా ఉంది. ఒక్కసారి ఊహించండి: ఇరువది సంవత్సరాలు ఆ ఇంటిలో ఒక ఖాళీ ఊయల. ప్రతి సంవత్సరం ఒక ఆశ, ప్రతి సంవత్సరం ఒక ఎదురుచూపు.

ఎలీసబెతు, యాజకుడైన జెకర్యా భార్య. వారిద్దరూ “దేవుని దృష్టికి నీతిమంతులైయుండిరి” (లూకా 1:6). అయినా వారి ఇంట పిల్లల సందడి లేదు; వయస్సు కూడా దాటిపోయింది. ఆ రోజుల్లో పిల్లలు లేకపోవడం ఒక అవమానముగా ఎంచబడేది. ఆ అవమానాన్ని ఆమె ఎన్నో ఏండ్లు మౌనంగా భరించింది. అందుకే గర్భవతి అయినప్పుడు ఆమె హృదయం నుండి వచ్చిన మాట ఇదే: “మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెను” (లూకా 1:24-25).

ఒకామె పాత నిబంధన ఆరంభంలో, మరొకామె క్రొత్త నిబంధన ఆరంభంలో. వారి మధ్య రెండు వేల సంవత్సరాల దూరం. అయినా ఇద్దరి కథలోనూ ఒకటే సత్యం: మూయబడిన గర్భమును తెరిచింది దేవుడే; ఆ గర్భములో కదలికను పుట్టించింది దేవుడే.

కానీ ఆ కదలికలు ఒకేలా లేవు. రిబ్కా గర్భములో శిశువులు “పెనుగులాడిరి” (ఆదికాండము 25:22); అది పోరాటపు కదలిక. ఎలీసబెతు గర్భములో శిశువు “గంతులు వేసెను” (లూకా 1:41); అది సంతోషపు కదలిక. పోరాటమైనా, సంతోషమైనా, గర్భకాలంలో విశ్వాసమును గూర్చి ఈ ఇద్దరు తల్లులూ మనకు ఎంతో నేర్పుతున్నారు.

గర్భములో బిడ్డ కదులుతుంది;
కానీ ఆ బిడ్డను కదిలించేది దేవుడే.

మోకాళ్లమీద మొదలైన బిడ్డలు

ఒక ఇంటిలో శుభవార్త వినబడగానే మొదట వచ్చే ప్రశ్నలు మనకు తెలుసు: “ఎన్నో నెల? డేట్ ఎప్పుడు? ఏ ఆసుపత్రి?” ఈ రోజుల్లో మనం గర్భాన్ని ప్లానింగ్‌గానో, వైద్య శాస్త్రంగానో, అదృష్టంగానో చూస్తున్నాం. స్కానింగ్ తెరమీద బిడ్డ చిన్ని చేతులు, కాళ్లు కనిపిస్తాయి; గుండె చప్పుడు గదంతా వినిపిస్తుంది. కానీ ఎంత చూసినా ఒక ప్రశ్నకు ఏ మెషీనూ జవాబు చెప్పలేదు: ఈ ప్రాణం ఎక్కడ నుండి వచ్చింది?

ఆ శుభవార్త విన్న రోజును ఏ తల్లిదండ్రులూ మరచిపోలేరు. ఆ క్షణం హృదయంలో పొంగిన సంతోషం, ఆశ్చర్యం, బహుశా కొంచెం భయం కూడా. ఆ బిడ్డ కొరకు ఎన్ని ప్రార్థనలు! తల్లిదండ్రులు ప్రార్థించారు, పెద్దలు ప్రార్థించారు, సంఘం ప్రార్థించింది. రేపు ఒడిలోకి రాబోతున్న ఆ చిన్ని ప్రాణం, ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడిచ్చిన జవాబు.

రిబ్కా, ఎలీసబెతుల కథలలో ఇదే సత్యం కనిపిస్తుంది. “ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య యైన రిబ్కా గర్భవతి ఆయెను” (ఆదికాండము 25:21). జెకర్యాతో దేవదూత పలికిన మొదటి మాటలు కూడా ఇవే: “జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు” (లూకా 1:13). ఈ రెండు వచనములను పక్కపక్కనే పెట్టి చూడండి. రెండింటిలోనూ హృదయాన్ని తాకే ఒకటే మాట: “ప్రార్థన వినబడెను.”

ఈ ఇద్దరు బిడ్డలూ మొదట రిపోర్టులో కాదు, మోకాళ్లమీద మొదలయ్యారు.

ఇస్సాకును ఒక్కసారి ఊహించండి. పెండ్లి అయినప్పుడు అతనికి నలుబది ఏండ్లు; బిడ్డలు పుట్టినప్పుడు అరువది ఏండ్లు (ఆదికాండము 25:20, 26). ఇరువది సంవత్సరాలు అతడు తన భార్య “విషయమై” మోకరించాడు. ఆమె కన్నీటిని తన ప్రార్థనగా మార్చుకొని దేవుని ముందు నిలబడిన భర్త అతడు. జెకర్యా ప్రార్థన ఎంత పాతదంటే, దేవదూత జవాబు తెచ్చినప్పుడు అతడే నమ్మలేకపోయాడు (లూకా 1:18). ప్రార్థించినవాడే ఆశ వదులుకొన్నా, దేవుడు మాత్రం మరచిపోలేదు. ఆలస్యమైనట్లు అనిపించినా, ఆయన జవాబు సరియైన సమయానికే వచ్చింది.

కీర్తనకారుడు ఈ సత్యాన్ని ఎంత అందంగా చెప్పాడో చూడండి: “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే” (కీర్తనలు 127:3). “స్వాస్థ్యము” అంటే వారసత్వపు ఆస్తి, తండ్రి ప్రేమతో పిల్లలకు అప్పగించే వరము. అది మనం సంపాదించుకున్నది కాదు; మనకు అనుగ్రహించబడినది.

మన ఇంటిలో ఉన్న ప్రతి మంచి వరము, మన పిల్లలు, మన కుటుంబం, మనం తీసే ప్రతి ఊపిరి, మన సంపాదన కాదు; దేవుని కృప. బహుమానమును చూసి మురిసిపోతూ, ఇచ్చినవారిని మరచిపోకూడదు. మన బిడ్డలు మన సొత్తు కాదు; దేవుడు నమ్మి మన చేతులకు అప్పగించిన స్వాస్థ్యము. వారిని కృతజ్ఞతతో స్వీకరిద్దాం; భయభక్తులతో పెంచుదాం. ఈ మాటలు చదువుతున్న మీలో ఎవరైనా ఇస్సాకులాగా ఇంకా కనిపెడుతూ ఉంటే, మీ హృదయాన్ని దేవుని ముందు గుమ్మరిస్తూనే ఉండండి. ఇరువది సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ప్రార్థన విన్నారు. మీ ప్రార్థనను కూడా ఆయన మరచిపోలేదు.

భయాన్ని ప్రార్థనగా మార్చిన తల్లి

గర్భకాలం అంటే అందరూ ఫోటోలు, సీమంతాలు, సంతోషాలే చూస్తారు. కానీ ప్రతి తల్లికీ తెలుసు, ఆ చిరునవ్వుల వెనుక కష్టమైన రోజులు కూడా ఉంటాయి. వాంతులు, అలసట, వెన్నునొప్పి, నిద్రపట్టని రాత్రులు, డాక్టరు రిపోర్టు చేతికి వచ్చేవరకు గుండెలో దడ. మన ఊర్లో అమ్మమ్మలు అంటారు కదా: “కడుపుతో ఉన్నప్పుడు అన్నీ వస్తయమ్మా, అది మామూలే.” నిజమే, మామూలే. కానీ మామూలు కష్టం కూడా కష్టమే.

పైకి చిరునవ్వుతో కనిపించినా, ఎదురుచూస్తున్న ప్రతి తల్లి లోపల ఎవరికీ చెప్పుకోలేని ఆలోచనలు ఉంటాయి. రాత్రి అందరూ నిద్రపోయాక కడుపుమీద చెయ్యి పెట్టుకొని, “అంతా సరిగ్గా జరుగుతుందా?” అని మనసులోనే అడుగుకొనే క్షణాలు ఉంటాయి. అమ్మా, అలా అనిపించినందుకు మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. బైబిలులో ఒక తల్లి ఇంకా ఎక్కువే అనుకుంది.

“ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె—ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను” (ఆదికాండము 25:22). మూల భాషలో “పెనుగులాడిరి” అనే మాటకు నలగగొట్టుకొనుట, ఒకరినొకరు త్రోసుకొనుట అనే అర్థం ఉంది. ఇరువది సంవత్సరాలు కన్నీటితో ప్రార్థించి పొందిన గర్భము, ఇప్పుడు ఆమెకు బాధగా మారింది. “ఇలా అయితే నేను బ్రతకడం ఎందుకు?” అనేంతగా ఆమె అలసిపోయింది.

అప్పుడు ఆమె ఏమి చేసింది? తన బాధను మనసులో దాచుకోలేదు; ఎవరి దగ్గరో గొణుగుకోలేదు; నేరుగా యెహోవాను “అడుగ వెళ్లెను.” దేవుని జవాబులో కూడా కష్టం ఉండవచ్చని, కష్టం వచ్చిందంటే దేవుడు విడిచిపెట్టారని అర్థం కాదని రిబ్కా కథ మనకు చెబుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే, దేవుడు ఆ కదలికలను ఆపలేదు. బదులుగా, ఆమె లోపల ఏమి జరుగుతుందో ఆమెకు ప్రేమతో వివరించారు: “రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును” (ఆదికాండము 25:23).

కదలికలు ఆగలేదు;
కానీ ఆమె మనస్సుకు నెమ్మది వచ్చింది.

అదే ప్రేమగల ఆహ్వానాన్ని అపొస్తలుడైన పేతురు మనకు అందిస్తున్నాడు: “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” (1 పేతురు 5:7). “యావత్తు” అంటే ఒక్కటీ మిగల్చకుండా ప్రతి చింత. పెద్దదైనా చిన్నదైనా, ఆసుపత్రి రిపోర్టైనా, అర్ధరాత్రి గుండెను పట్టుకొనే భయమైనా, అన్నీ ఆయనమీద వేయవచ్చు.

ఇది ఒక్క గర్భిణీ స్త్రీకి మాత్రమే కాదు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలలో కూడా మనకు కష్టాలు వస్తాయి: క్రొత్త ఉద్యోగంలో, క్రొత్త వివాహంలో, క్రొత్త పరిచర్యలో. అలాంటప్పుడు రిబ్కాలాగా నేరుగా యెహోవా దగ్గరకు వెళ్దాం. భర్తలు ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి: మీ భార్య ఆ ప్రార్థనలో ఒంటరిగా ఉండకూడదు. ఆమె పక్కన కూర్చోండి; ఆమె చేతిని పట్టుకొని కలిసి ప్రార్థించండి. ప్రతిరోజు ఆ బిడ్డ మీద మెల్లగా చెయ్యి పెట్టి ఒక చిన్న ప్రార్థన చేయండి. ఆ చేతి స్పర్శ తల్లికి ధైర్యం, బిడ్డకు దీవెన.

ఆనందముతో గంతులు వేసిన గర్భము

మన తెలుగు ఇళ్లలో ఒక అందమైన అలవాటు ఉంది: సంతోషాన్ని ఎవ్వరూ ఒంటరిగా అనుభవించరు. శుభవార్త వస్తే వెంటనే ఫోన్లు, స్వీట్లు, బంధువుల రాకపోకలు. సంతోషం పంచుకుంటే రెట్టింపు అవుతుంది. కానీ అదే ఇళ్లలో కొన్నిసార్లు సలహాల పేరుతో విమర్శలు, భయపెట్టే కథలు, “మా రోజుల్లో అయితే…” అనే పోలికలు కూడా వినిపిస్తాయి. గర్భిణీ తల్లికి కావలసింది భయం కాదు, దీవెన.

సీమంతపు రోజు బంధువులంతా కూడుకొనేది ఆ ఒక్క కారణం కోసమే: ఆ తల్లిని దీవించడానికి, ఆమెతో కలిసి సంతోషించడానికి. ఆ గాజుల గలగలలు, ఆ నవ్వులు, ఆ ప్రార్థనలు లోపల ఉన్న బిడ్డ కూడా వింటోంది. ఆ రోజు ఇల్లంతా ఆశీర్వాదంతో నిండిపోతుంది. కానీ ఆ ఆశీర్వాదం ఆ ఒక్క రోజుతో ఆగిపోకూడదు.

ఎలీసబెతు ఇంటిలో జరిగింది ఇదే. యౌవనురాలైన మరియ ఆ ఇంటికి వచ్చి వందనం చెప్పగానే, “ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను—స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను?” (లూకా 1:41-43). మూల భాషలో “గంతులు వేసెను” అనే మాటకు ఆనందముతో ఎగురుట అని అర్థం. ఇంకా పుట్టని ఒక చిన్ని బిడ్డ, తల్లి గర్భములోనే ఆనందంతో ఎగిరిపడ్డాడు.

ఎందుకు? ఆ ఆనందానికి కారణం యేసు సన్నిధి. మరియ గర్భములో ఉన్న ప్రభువైన యేసు ఆ ఇంటిలోకి వచ్చారు (లూకా 1:43); ఇంకా కళ్లు తెరవని యోహాను కూడా ఆ సన్నిధిని గుర్తించాడు. ఆ ఇంటిలో మరొక అందమైన దృశ్యం చూడండి: వృద్ధురాలైన ఎలీసబెతు, యౌవనురాలైన మరియ, ఇద్దరు గర్భిణీ స్త్రీలు ఒకరినొకరు దీవించుకొంటున్నారు. అక్కడ పోలికలు లేవు, అసూయ లేదు, భయపెట్టే మాటలు లేవు; ఆశీర్వాద వాక్యాలే ఉన్నాయి. ఆ దీవెన మాటలన్నిటికీ కిరీటం ఈ వచనం: “ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను” (లూకా 1:45). ఎలీసబెతు (ఎలీషెబా) అనే పేరుకు అర్థమే “నా దేవుడు ప్రమాణము.” ఆయన తన మాట ఎప్పుడూ నెరవేరుస్తారు.

ఆ సంతోషం ఆ నాలుగు గోడల మధ్య ఆగిపోలేదు: “అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి” (లూకా 1:58).

నిజమైన ఆనందం వస్తువుల వల్ల రాదు; యేసు సన్నిధి వల్ల వస్తుంది. యేసు ఉన్న ఇంటిలో సంతోషం ఉంటుంది. మన ఇళ్లు ఎలీసబెతు ఇంటిలాగా ఉండాలి: భయపెట్టే ఇళ్లు కాదు, ఒకరినొకరు దీవించుకొనే ఇళ్లు. అత్తగార్లారా, అమ్మలారా, అక్కచెల్లెళ్లారా, ఎలీసబెతు మరియను దీవించినట్లు మీ ఇంటి గర్భిణీ తల్లిని మీ మాటలతో దీవించండి. మీరు పలికే ఒక్క ప్రేమగల మాట ఆమె రోజంతటినీ వెలిగించగలదు. ఆ పొరుగువారివలె మనమందరమూ ఆమెతో కలిసి సంతోషిద్దాం. దేవుని మాటను నమ్మి, ఆయన సన్నిధితో నిండిన ఇల్లు ఎప్పుడూ ధన్యమైనదే.

వేదనను మరపించే సంతోషం

రిబ్కా పోరాటం, ఎలీసబెతు ఆనందం, ఈ రెండూ ఒకే ప్రయాణంలో భాగాలని ప్రభువైన యేసే స్వయంగా ఎంతో మృదువుగా చెప్పారు: “స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు” (యోహాను 16:21).

వేదన నిజమే; కానీ అది తాత్కాలికం. సంతోషం దానికంటే గొప్పది. ఆ చిన్ని బిడ్డను మొదటిసారి చేతుల్లోకి తీసుకొన్న క్షణం, ఆ బిడ్డ తొలి ఏడుపు విన్న క్షణం, ఈ నెలల అలసట అంతా ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇది తల్లులకే కాదు, మనందరికీ యేసు ఇచ్చిన వాగ్దానం. ఈ లోకంలో మనకు వేదన ఉండవచ్చు; కానీ దేవుని పిల్లల కథ ఎప్పుడూ సంతోషంతోనే ముగుస్తుంది.

రిబ్కా గర్భములో పోరాటం ఉంది; ఎలీసబెతు గర్భములో ఆనందం ఉంది. కానీ రెండు గర్భములనూ తెరిచినది, కాపాడినది, నెరవేర్చినది ఒక్క దేవుడే. ఆ దేవుడు ఈ రోజు మీ ఇంటిలోనూ ఉన్నారు.

అమ్మా, మీ బిడ్డ కదిలిన ప్రతిసారీ ఒక్క క్షణం ఆగి, ఆ చోట మెల్లగా చెయ్యి పెట్టి గుర్తుంచుకోండి: దేవుడు మీ బిడ్డను కదిలిస్తున్నారు…

Signature

Pastor John Prabhu Kiran,
Senior Pastor - IBM Church,
Professor of Theology - Andhra Bible College

* పల్లవి శ్రావ్య, జార్జ్ రిచర్డ్స్ దంపతుల సీమంతపు కార్యక్రమం సందర్భంగా వ్రాయబడినది.

PDF డౌన్‌లోడ్ చేయండి (A5)

Share · పంచుకోండి WhatsApp Facebook

← All articles

Apply nowPrograms